Remdesivir: రెమ్డెసివిర్ వాడకంతో తగ్గుతున్న గుండె వేగం.. జాగ్రత్త అవసరమంటున్న నిపుణులు
- కరోనా సోకిన మహిళకు రెమ్డెసివిర్ ఇచ్చిన వైద్యులు
- 24 గంటల తర్వాత సగానికి పడిపోయిన గుండె వేగం
- డోపమైన్ ఇవ్వడంతో మళ్లీ సాధారణ స్థితికి
కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్తో గుండె వేగం బాగా నెమ్మదిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. అమెరికాలోని రీజినల్ మెడికల్ సెంటర్ బేయోనెట్ పాయింట్లో చేరిన మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారించిన వైద్యులు రెమ్డెసివిర్తో చికిత్స ప్రారంభించారు.
అయితే, ఈ ఔషధం ఇచ్చిన 24 గంటల తర్వాత ఆమె రక్తపోటు పడిపోవడం, గుండె వేగం తగ్గిపోయి నిమిషానికి 38 సార్లే కొట్టుకుంటున్నట్టు గుర్తించారు. అంతకుముందు ఆమెకు ఎలాంటి గుండె జబ్బులు లేకపోయినా గుండె వేగం నెమ్మదించడం వైద్యులను షాక్కు గురిచేసింది. రెమ్డెసివిర్ ఇవ్వడానికి ముందు చేసిన ఈసీజీ పరీక్షలు కూడా సాధారణంగా ఉన్నాయి.
దీంతో రెమ్డెసివిర్ కారణంగానే ఆమె గుండెవేగం నెమ్మదించినట్టు గుర్తించారు. వెంటనే డోపమైన్ ఇవ్వడంతో గుండె వేగం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. రెమ్డెసివిర్ చివరి మోతాదు ఇచ్చిన 18 గంటల తర్వాత డోపమైన్ ఇవ్వడాన్ని ఆపేశారు. దీంతో ఆమె కోలుకున్నారు. గుండె పనితీరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.
కాబట్టి రెమ్డెసివిర్ ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుండె పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కనుక వస్తే వెంటనే అందుకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. రోగికి అప్పటికే గుండెకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు హార్ట్ రిథమ్ సొసైటీ పత్రికలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.