Abrar: శ్రీనగర్ లో లష్కరే తోయిబా అగ్రనేత అబ్రార్ ను హతమార్చిన భద్రతాదళాలు!

Terrorist Abrar Dead in Encounter
  • నిన్న అరెస్ట్ అయిన అబ్రార్
  • ఆయుధాల రికవరీ కోసం వెళ్లగా దాడి
  • శ్రీనగర్ సమీపంలో ఎన్ కౌంటర్
పాకిస్థాన్ కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబ్రార్ ను భారత జవాన్లు హతమార్చారు. శ్రీనగర్ సమీపంలోని మాలోరా పరింపోరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతను మృతిచెందాడు. అబ్రార్ ను నిన్న అదుపులోకి తీసుకున్న జవాన్లు, ఇంటరాగేషన్ లో భాగంగా, అతను ఏకే-47 రైఫిల్ ను దాచిన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆయుధాన్ని రికవరీ చేస్తున్న క్రమంలో అబ్రార్ అనుచరుడు తిరగబడి, జవాన్లపై కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ అనివార్యమైందని ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఆ ఇంట్లో ఉన్న ఓ విదేశీ ఉగ్రవాది జవాన్లను చూసి, లోపలి నుంచి కాల్పులు ప్రారంభించాడని, అబ్రార్ కూడా తిరగబడ్డాడని, ఆపై జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరూ మరణించారని, ఆ ఇంటి నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ వెల్లడించారు.

విదేశీ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించిన అనంతరం ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయని, ఆ వెంటనే రాష్ట్ర పోలీసులతో పాటు అదనపు బలగాలను రప్పించి, ఇంటిని చుట్టుముట్టామని అన్నారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హతులైన ఇద్దరు ఉగ్రవాదులూ, గతంలో ఎన్నో దాడులు చేశారని అన్నారు. శ్రీనగర్ హైవేపై జరిగిన బాంబు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని తెలిపారు.
Abrar
Sri Nagar
Encounter
Jammu And Kashmir
CRPF

More Telugu News