Narendra Modi: ‘మన్ కీ బాత్’లో పాల్గొననున్న తెలంగాణ చాయ్‌వాలా.. పీఎంవో నుంచి లేఖ
- వచ్చేనెలలో పాల్గొననున్న వరంగల్ వాసి పాషా
- 40 ఏళ్లుగా ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్‌పై టీస్టాల్
- ఆత్మ నిర్భర్ పథకం ద్వారా సాయం అందుకున్న పాషా
‘మన్ కీ బాత్’లో తెలంగాణకు చెందిన చాయ్‌వాలా పాల్గొననున్నాడు. అందులో పాల్గొనాలని ఆయనకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి లేఖ అందింది. వరంగల్ నగరంలోని పాటక్ మహేలా ప్రాంతానికి చెందిన చాయ్‌వాలా మహ్మద్ పాషా 40 ఏళ్లుగా ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్‌పై టీస్టాల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ పథకం ద్వారా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పాషా రూ.10 వేల రుణాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే, టీ అమ్మకాలకు గూగుల్‌పే, ఫోన్‌పే వాడుతున్నాడు. ఆత్మనిర్భర్ ద్వారా రుణం తీసుకుని సద్వినియోగం చేసుకున్న దేశంలోని కొందరు వీధి వ్యాపారులను మన్ కీ బాత్‌కు ఎంపిక చేశారు.
అందులో పాషా కూడా ఉన్నారని వరంగల్ జిల్లా మెప్మా పీడీ భద్రు తెలిపారు. పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో పాషా సంబరపడిపోతున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో పలు అంశాలపై మాట్లాడతారన్న విషయం తెలిసిందే. వచ్చే నెల మన్ కీ బాత్‌లో ఆయన చాయ్‌వాలాలతో మాట్లాడనున్నారు.