Arjun: ఆంజనేయస్వామి ఆలయం నిర్మించిన అర్జున్
- చెన్నైలో సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మించిన అర్జున్
- జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకం
- కరోనా వల్ల ఎవరినీ ఆహ్వానించడం లేదని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు అర్జున్ ఆంజనేయస్వామిని ఎంతో భక్తితో కొలుస్తారు. ఆయనపై ఉన్న భక్తితో ఆయనకు ఏకంగా ఒక గుడినే నిర్మించారు. చెన్నైలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఆంజనేయుడికి ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయ నిర్మాణ పనులు 15 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జులై 1న కుంభాభిషేకం జరగనుంది. భక్తుల సందర్శనార్థం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆలయ ప్రారంభోత్సవం గురించి అర్జున్ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు.
చెన్నైలో 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆంజనేయస్వామి గుడి పనులు ఇప్పుడు పూర్తయ్యాయని అర్జున్ తెలిపారు. జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. అభిమానులు, స్నేహితులు, తనకు తెలిసిన వాళ్లందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకున్నానని... అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎవరినీ ఆహ్వానించడం లేదని తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో లైవ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించిన లింక్స్ ను తన ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చని తెలిపారు.