Balakrishna: తెలుగు రాష్ట్రాల ఆసుపత్రుల్లో ఇలాంటి టెక్నాలజీ ఇదే ప్రథమం: నందమూరి బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రిలో మరో సదుపాయం
- కొత్తగా ప్లాస్మా స్టెరిలైజర్ ప్రారంభం
- ఎంతో అధునాతమైనదని వెల్లడించిన బాలకృష్ణ
- పర్యావరణానికి హాని చేయదని స్పష్టీకరణ
క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందిస్తున్న హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రిలో కొత్తగా ప్లాస్మా స్టెరిలైజర్ (ఏఎస్ పీ స్టెరాడ్ 100ఎన్ఎక్స్) యంత్రాలను ప్రారంభించినట్టు తెలిపారు.
ఈ అధునాతన ప్లాస్మా టెక్నాలజీ ద్వారా యాంటీమైక్రోబియల్ యాక్టివిటీకి సంబంధించిన సూక్ష్మ అంశాలను కూడా విస్తృతస్థాయిలో గుర్తించవచ్చని వివరించారు. థర్మల్, కెమికల్ ఆధారిత వ్యవస్థలతో పోల్చితే ఈ ప్లాస్మా టెక్నాలజీ పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదే ప్రథమం అని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా బాలయ్య ఫేస్ బుక్ లో పంచుకున్నారు.