Range Rover SVR: భారత మార్కెట్లోకి 'రేంజ్ రోవర్ ఎస్వీఆర్'... ధర మామూలుగా లేదు!
- జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచి కొత్త వాహనం
- ప్రారంభ ధర రూ.2.19 కోట్లు
- అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ తో వస్తున్న వాహనం
- లగ్జరీ సెగ్మెంట్లో విశేషంగా ప్రభావం చూపే అవకాశం
ప్రముఖ కార్ల బ్రాండు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ భారత మార్కెట్లోకి రానుంది. రేంజ్ రోవర్ సిరీస్ లో వస్తున్న ఈ వాహనానికి స్పోర్ట్ ఎస్వీఆర్ గా నామకరణం చేశారు. లగ్జరీ వాహనాల సెగ్మెంట్లో ఇది దుమ్మురేపడం ఖాయమని ల్యాండ్ రోవర్ ఇండియా భావిస్తోంది. ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ ప్రారంభ ధర అదరిపోయేలా ఉంది. ఎక్స్ షోరూమ్ ధర రూ.2.19 కోట్లు అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ లగ్జరీ వాహనంలో సూపర్ చార్జ్ డ్ ఇంజిన్ ను అమర్చారు. ల్యాండ్ రోవర్ కార్లలో ఇప్పటివరకు ఇదే అత్యంత శక్తిమంతమైన వాహనం. దీనిపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఎండీ రోహిత్ సూరి మాట్లాడుతూ, బ్రిటీష్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్ రూపుదిద్దుకుందని తెలిపారు. హైఎండ్ కార్ల ప్రియులను ఈ వాహనంలోని లగ్జరీ విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
ఈ 2021 మోడల్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ సాంకేతిక వివరాలను కూడా రోహిత్ సూరి పంచుకున్నారు. దీంట్లో 5.0 లీటర్ సూపర్ చార్జ్ డ్ వీ8 ఇంజిన్ ను అమర్చారు. ఇది కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగం అందుకోగలదు. దీని గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు. బరువు పరంగా ఎంతో తేలిగ్గా కనిపించే ఎస్వీఆర్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇంటీరియర్స్ చూస్తే... అత్యంత నాణ్యమైన విండ్సర్ లెదర్ ను వాడారు. దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే. 825 వాట్లతో కూడిన 19 స్పీకర్ల మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ను దీంట్లో పొందుపరిచారు.