Aditi Singh: మైక్రోసాఫ్ట్ అజ్యూర్ లో బగ్ ను గుర్తించి రూ.22 లక్షలు దక్కించుకున్న భారత యువతి

Indian girl Aditi Singh found bug in Microsoft Azure cloud computing system
  • అజ్యూర్ లో ఆర్ సీఈ బగ్
  • రెండు నెలల కిత్రమే కనుగొన్న అదితి సింగ్
  • మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
  • లోపం నిజమేనని నిర్ధారించుకున్న టెక్ దిగ్గజం
సాఫ్ట్ వేర్ కంపెనీలు, టెక్ సంస్థలు తమ ఉత్పత్తుల్లోని లోపాలను గుర్తించేవారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహక బహుమతులను అందిస్తుంటాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా తాజాగా ఓ భారత యువతికి భారీగా నజరానా అందించింది. తన అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్ వేర్ లో బగ్ ను గుర్తించిన అదితి సింగ్ (20) అనే యువతికి రూ.22 లక్షలు ఇచ్చింది. అజ్యూర్ క్లౌడ్ సిస్టమ్ లోని రిమోట్ కోడ్ విభాగంలో ఉన్న లోపాన్ని అదితి సింగ్ కనుగొంది.

అదితి స్వస్థలం ఢిల్లీ. వైద్య విద్య అభ్యసించాలన్నది ఆమె కల. కానీ మెడికల్ ఎంట్రెన్సులో మెరుగైన ర్యాంకు రాకపోవడంతో ఆమె ఎథికల్ హ్యాకింగ్ వైపు మళ్లింది. కొద్దికాలంలోనే కోడ్ లాంగ్వేజీలపై పట్టు సాధించి, ప్రముఖ ఐటీ సంస్థల ఉత్పత్తుల్లోని బగ్ లను గుర్తించే స్థాయికి ఎదిగింది.

అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉన్న బగ్ ను రెండు నెలల కిందటే గుర్తించిన ఈ ఢిల్లీ అమ్మాయి వెంటనే మైక్రోసాఫ్ట్ కు నివేదించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఎంతో సులువుగా క్లౌడ్ వ్యవస్థల్లోకి చొరబడగలరని అదితి వెల్లడించింది. ఈ లోపాన్ని కాస్త ఆలస్యంగానైనా నిర్ధారించుకున్న మైక్రోసాఫ్ట్... ఆపై అదితికి భారీ బహుమతి అందించింది.

అదితి ఇప్పటివరకు అనేక బగ్ లను గుర్తించింది. పేటీఎం, టిక్ టాక్, ఫేస్ బుక్, హెచ్ పీ, మొజిల్లా వంటి కంపెనీల ఉత్పత్తుల్లో లోపాలను కనుగొని, వాటిని ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, అన్నింట్లోకి మైక్రోసాఫ్ట్ నుంచి దక్కిన బహుమతే అతి పెద్ద మొత్తం అని అదితి వెల్లడించింది.
Aditi Singh
Bug
Microsoft Azure
Bounty
New Delhi
India

More Telugu News