AP Govt: మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రభుత్వం
- హైకోర్టు స్టేతో నిలిచిన సిట్ విచారణ
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన సర్కారు
- విచారణ 3 వారాలకు వాయిదా
అమరావతిలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆస్తులు కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. గతంలో దమ్మాలపాటి కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం మూడు వారాల సమయం కోరింది. అదనపు సమాచారం కోసం తగినంత సమయం కావాలని విన్నవించింది. ప్రభుత్వ విజ్ఞప్తికి అంగీకరించిన సుప్రీంకోర్టు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే టీడీపీ నేతలు, దమ్మాలపాటి శ్రీనివాస్ అక్రమంగా భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో సిట్ విచారణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.