Corona Virus: పాలిచ్చే తల్లులు, గర్భిణులకు ఆ నాలుగు కరోనా టీకాలు సురక్షితమే: కేంద్రం
- భారత్‌లో అందుబాటులోకి వచ్చిన నాలుగు టీకాలు
- అన్నీ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టీకరణ
- సంతానోత్పత్తి సమస్యలూ ఉండవని స్పష్టం
- గర్భిణులకు కరోనా సోకితే బిడ్డపై ప్రభావం పడే అవకాశం
భారత్‌లో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి, మోడెర్నా కరోనా టీకాలు పాలిచ్చే మహిళలు, గర్భిణులకు సురక్షితమైనవేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని కరోనా కట్టడి కార్యదళంలో కీలక వ్యక్తి, నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ తెలిపారు. దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ ఇంకా కొన్ని పరిశీలనలు చేస్తోందని పేర్కొన్నారు. వీటి వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా ఉండవని స్పష్టం చేశారు.
గర్భిణులకు టీకా ఇచ్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్‌కు సంబంధించి ఆరోగ్య శాఖ ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ఓ గైడ్‌ను రూపొందించింది. ఇప్పటివరకు కరోనా సోకిన గర్భిణుల్లో 90 శాతం మంది కోలుకున్నారు. అయితే, కొంత మందిలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తితే అది కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు కూడా టీకా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.