Odisha: సైబర్ క్రైమ్ సిండికేట్... ఏడుగురి నుంచి 16 వేల సిమ్ కార్డుల స్వాధీనం!

Cuttack Police Burusts Cyber Crime Syndicate

  • సైబర్ క్రైమ్ కేటుగాళ్లకు అరదండాలు
  • సిమ్ లను అందించిన మరో ఇద్దరు కూడా అరెస్ట్
  • వారి మోసాలను విచారిస్తున్నామన్న పోలీసులు

కటక్ పోలీసులు భారీ సైబర్ సిండికేట్ రాకెట్ ను ఛేదించారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి 16 వేల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన భువనేశ్వర్ - కటక్ పోలీసు కమిషనర్ ఎస్కే ప్రియదర్శి, వీరికి సిమ్ కార్డులను అందిస్తున్న మరో ఇద్దరు సర్వీస్ ప్రొవైడర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సిమ్ కార్డులను తప్పుడు గుర్తింపు కార్డులను వినియోగించి తీసుకున్నారని అన్నారు. వారు పాల్పడిన మోసాలను విచారిస్తున్నామని చెప్పారు.  

వాస్తవానికి ఒక సిమ్ కార్డును జారీ చేయాలంటే, సర్వీస్ ప్రొవైడర్ ముందుగానే వ్యక్తి గుర్తింపు పత్రాలను తీసుకోవాలి. ఆ తరువాతే వాటిని యాక్టివేట్ చేయాల్సి వుంటుంది. అయితే కొందరు అక్రమార్కులు మరెవరో ఇచ్చే ధ్రువపత్రాలతో సిమ్ లను ముందే యాక్టివేట్ చేసి, వాటిని అధిక డబ్బుకు అమ్ముకుంటున్నారు. ఇదే నేరస్తులకు వరంగా మారింది. ఫోన్ కాల్స్ ద్వారా మోసాలు చేసే వీరిని నంబర్ సాయంతో పట్టుకునే అవకాశాలు లేకపోవడంతో, ఈ వ్యవహారం పోలీసులకు పెను సవాలుగా మారుతుంది.

కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, 2019లో సైబర్ నేరాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 63.5 శాతం పెరిగాయి. సైబర్ క్రైమ్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతూ ఉంటే, ఇలాంటి ప్రీ యాక్టివేటెడ్ సిమ్ లకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News