Nirav Modi: తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టులో నీరవ్ మోదీ అప్పీలు
- పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు
- రెండేళ్లుగా వాండ్స్‌వర్త్ జైలులో నీరవ్ మోదీ
- నీరవ్ పిటిషన్‌పై వచ్చే నెల 21న వాదనలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లుగా లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్న నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన మరోమారు లండన్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనూ ఓసారి అప్పీల్ చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈసారి తమ వాదనలను నేరుగా వినాలని నీరవ్ తరపు న్యాయవాదులు అప్పీలు చేశారు. దీంతో జులై 21న వాదనలు వినేందుకు న్యాయస్థానం అనుమతి నిచ్చింది.
కాగా, 19 మార్చి 2019 నుంచి జైలులోనే ఉంటున్న 50 ఏళ్ల నీరవ్.. పలుమార్లు పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను ‘ఫ్లైట్ రిస్క్’ను కారణంగా చూపిస్తూ కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ బంధువు మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాలో పోలీసుల నిర్బంధంలో ఉన్నాడు.