Anti Drone System: జమ్ము ఎయిర్ బేస్ లో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు
- ఇటీవల జమ్ము ఎయిర్ బేస్ పై డ్రోన్ దాడి
- కొన్నిరోజులుగా డ్రోన్లు కనిపిస్తున్న వైనం
- యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన ఎన్ఎస్జీ
- రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ కూడా ఏర్పాటు
జూన్ 27న జమ్ము ఎయిర్ బేస్ టెక్నికల్ ఏరియాలో డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దానికితోడు కొన్నిరోజులుగా నిత్యం గుర్తు తెలియని డ్రోన్లు దర్శనమిస్తుండడంతో, ఇక్కడి భారత వాయుసేన స్థావరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఇక్కడ మోహరించినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. దీంతోపాటే రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. కాగా, డ్రోన్లు నేడు కూడా కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజ్వానీ ప్రాంతాల్లో వీటిని గుర్తించారు.