Polavaram Project: పోలవరం నిర్వాసితుల వద్దకు వెళ్లకుండా సజ్జల నాటకాలాడుతున్నారు: దేవినేని ఉమ
- పోలవరం ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్‌గా మార్చేశారు
- ముంపు గ్రామాలను గాలికొదిలేశారు
- ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా ఇస్తామన్న రూ. 10 లక్షలు ఏమయ్యాయి?
అనధికార మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పోలవరం నిర్వాసితుల వద్దకు వెళ్లకుండా నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు విమర్శిస్తుంటే ఏపీ మంత్రులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఒక్క జీవోతో పోలవరం ప్రాజెక్టును మొత్తానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేశారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులా మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారని విమర్శించారు. పోలవరం ఎడమ కాలువ, పురుషోత్తపట్నం, పట్టిసీమ లిఫ్ట్‌ను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాలను గాలికి వదిలేశారన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 10 లక్షలు ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఈ రెండేళ్ల కాలంలో రూ. 845 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని దేవినేని ఆరోపించారు.