Vanglapudi Anitha: ఇంతకీ ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు?: వంగలపూడి అనిత
- కాపీ పేస్ట్ యాప్ తీసుకొచ్చి దానికి దిశ అని పేరు పెట్టారు
- చంద్రబాబు సాధన దీక్ష నుంచి జనం దృష్టి మరల్చేందుకే
- మహిళా మిత్రలకు పోలీసు దుస్తులా?
- యాప్ ప్రకటనల్లో మహిళా మంత్రులేరీ?
ఏపీకి త్వరలోనే ఓ మహిళ ముఖ్యమంత్రి కాబోతున్న విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మాటల ద్వారా తెలుస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్‌తోపాటు ఉంటూ తరచూ జగన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్తున్న మహిళే సీఎం కాబోతున్నారా? లేక, హైదరాబాద్‌లో ఉంటున్న వారా? అని ప్రశ్నించారు.
అలాగే, ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌పైనా ఆమె విమర్శలు చేశారు. కాపీ పేస్ట్ చేసి ఓ యప్‌ను తీసుకొచ్చి, దానికి దిశ అని పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. ఫోర్త్ లయన్ యాప్ పేరు మార్చిన విషయం డీజీపీకి, ఉన్నతాధికారులకు తెలియకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న సాధన దీక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే దిశ యాప్ పేరుతో జగన్ ఆర్భాటం చేశారని విమర్శించారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల్లో సగం జగన్ నియమించిన వలంటీర్లు చేసినవేనని ఆరోపించారు. రాష్ట్రంలో శిక్షణ పొందిన మహిళా పోలీసులు, హోం గార్డులు ఉండగా, మహిళా మిత్రలకు పోలీసు దుస్తులు ఇస్తామని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటని నిలదీశారు. మహిళల కోసం తీసుకొచ్చిన దిశ యాప్ ప్రకటనల్లో మహిళా హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు లేకపోవడం శోచనీయమని అనిత అన్నారు.