Maharashtra: కురుక్షేత్రం మధ్యలో ఉన్నాం.. బీజేపీ అభిమన్యుడిలా కాకూడదు: శివసేన

Maharashtra At Center Of Kurukshetra Battle Says Shiv Sena Editorial In Saamna

  • సామ్నా ఎడిటోరియల్ లో బీజేపీకి చురకలు
  • శ్రీకృష్ణుడిలా మధ్య నుంచే పోరాటం
  • కూటమి శ్రీకృష్ణుడి రథంలా దూసుకుపోతోంది
  • బీజేపీ వల్లే రాష్ట్రంలో ఈ కూటమి

ప్రస్తతం మహారాష్ట్ర కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఉందని, కరోనా, అవినీతి దర్యాప్తు వంటి వాటిని ఎదుర్కొంటోందని అధికార శివసేన పేర్కొంది. మహాభారత పురాణ గాథలోని సంఘటనలను ఉదహరిస్తూ తన పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ యుద్ధంలో బీజేపీ.. అభిమన్యుడిలా మారకూడదని హితవు చెప్పింది.

‘‘రాష్ట్రం ఇప్పుడు కరోనాతో పోరాడుతోంది. దాంతో పాటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ నిరంకుశ చర్యలనూ ఎదుర్కొంటోంది. అలాంటి నిరంకుశవాదులతో పోరాడి మమతా బెనర్జీ గెలిచారు. మహారాష్ట్ర కూడా ఆమె దారిలోనే వెళ్లి వారితో పోరాడాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది.

ఈ విషయాలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవలి భేటీలో చెప్పే ఉంటారని పేర్కొంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసారథిగా మారి కురుక్షేత్ర యుద్ధం మధ్యలోకి తీసుకెళ్లాడని, మధ్యలో ఉండే శత్రువులను ఎదుర్కొని అధర్మాన్ని ఓడించాడని ఉటంకించింది. మంగళవారం సాయంత్రం శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలు సమావేశమయ్యారని, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్నే వారూ అనుసరించాలని సూచించింది.

సమావేశం అయిపోయి వెళ్లిపోయేటప్పుడు శరద్ పవార్ మొహం వెలిగిపోయిందని, ఆయనలో సంతృప్తి కనిపించిందని పేర్కొంటూ సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయన్న వాదనలను కొట్టిపారేసింది. ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ కూడా మంచి విశ్వాసంతో ఉన్నారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేతలు కూడా సౌకర్యవంతంగానే ఉన్నారంది. కాబట్టి మహా వికాస్ అఘాడీ శ్రీకృష్ణుడి రథంలాగానే దూసుకుపోతోందని పేర్కొంది. యుద్ధంలో శత్రు వినాశనం తథ్యమని చెప్పింది.

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందన్న ఆశలతో బీజేపీ పండుగ చేసుకుంటోందని, కానీ, అది జరిగేది కాదని వ్యాసంలో శివసేన తేల్చి చెప్పింది. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఉద్ధవ్ భేటీ కాగానే.. రాజ్ భవన్ లో మరోసారి రహస్య ప్రమాణాలు జరుగుతాయన్న పుకార్లు షికారు చేశాయని అసహనం వ్యక్తం చేసింది. ఎవరైనా అలా అనుకుంటే అది రాజకీయ పగటి కలే అవుతుందని పేర్కొంది. బీజేపీ వల్లే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, బీజేపీ మొండి వైఖరితో ఉద్ధవ్ ను ముందుకు నెట్టడం వల్లే ఆయన ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐని వాడుకుని రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని శివసేన ఆరోపించింది.

  • Loading...

More Telugu News