Nirav Modi: అప్రూవర్ గా మారి.. ఈడీకి రూ. 17.5 కోట్లను చెల్లించిన నీరవ్ మోదీ సోదరి
- పీఎన్బీకి రూ. 13,500 కోట్ల శఠగోపం పెట్టిన నీరవ్ మోదీ
- ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పూర్వి, ఆమె భర్త
- అప్రూవర్ గా మారడంతో క్షమాభిక్ష పెట్టిన ఈడీ
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,500 కోట్ల మేర శఠగోపం పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ కు చెక్కేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. ఇదే కేసులో నీరవ్ సోదరి పూర్వి మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతాలు కూడా ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని ఈడీ విచారిస్తోంది. అయితే, ఈ కేసులో పూర్వి మోదీ అప్రూవర్ గా మారిపోయింది. అంతేకాదు, లండన్ బ్యాంకు నుంచి రూ. 17.5 కోట్లను ఈడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టకుండా ఈడీ క్షమాభిక్ష పెట్టింది.
లండన్ లోని ఒక బ్యాంకులో తన పేరిట నీరవ్ మోదీ ఈ సొమ్మును రెమిట్ చేసినట్టు తనకు తెలిసిందని... ఆ మొత్తాన్ని భారత ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నానని ఆమె చెప్పినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఆమె సహకారంతో నీరవ్ కు చెందిన రూ. 17.25 కోట్లను రికవర్ చేయగలిగామని చెప్పారు. తాము అప్రూవర్లుగా మారతామని పూర్వి, ఆమె భర్త గత జనవరి 4న ఈడీకి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో, ఈడీ వీరిని క్షమించి వదిలేసింది.