Kodali Nani: ఏపీలో అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా జరుగుతున్నాయి: మంత్రి కొడాలి నాని
- ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లను నిర్మిస్తాం
- ఈ నెల 5 నుంచి కృష్ణా జిల్లాకు సాగునీటిని విడుదల చేస్తాం
- చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం వుంది
ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ ఏడాది 15 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ఈ రోజు నుంచి ఈ నెల 4 వరకు శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. అయితే, ఇంత చేస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం నిరసన దీక్షలను చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.
జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని కొడాలి నాని అన్నారు. ఈ నెల 5 నుంచి కృష్ణా జిల్లాకు సాగునీటిని విడుదల చేస్తామని చెప్పారు. వైయస్సార్ బీమా పథకం పేదలకు ఒక వరమని... ఈ బీమా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తోందని తెలిపారు.
మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ, వణుకూరులో 610 మంది లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన చేశామని చెప్పారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ముఖ్యమంత్రి ఇళ్లను ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 50 వేల కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,705 జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని తెలిపారు.