America: ఏపీలో అక్రమాలపై గళమెత్తినందుకు నా కుటుంబాన్ని హింసిస్తున్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, హైకోర్టు సీజేలకు ప్రవాసాంధ్రుడి లేఖ
- అమెరికా నుంచి లేఖలు రాసిన బొద్దలూరి యశస్వి
- మాచర్లలోని అక్రమాలపై యూట్యూబ్ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకే
- తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆవేదన
- రక్షణ కల్పించాలని వేడుకోలు
హైదరాబాద్‌లో నివసిస్తున్న తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్వి అమెరికా నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు.
గుంటూరు జిల్లా మాచర్లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, హింసాకాండపై తన యూట్యూబ్ చానల్ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందుకు సహించలేని కొందరు గూండాలు హైదరాబాద్‌లో తన తల్లి, సోదరుడు నివసిస్తున్న ఫ్లాట్‌పై దాడి చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక, మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 18న తనపై కేసు నమోదు చేశారని, దాని ఆధారంగా పోలీసులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తన కుటుంబ సభ్యులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద గూండాల్లా ఉన్న నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, 25న మళ్లీ వచ్చి ఫ్లాట్ తలుపుల్ని బలంగా తన్నారని ఆరోపించారు. తన తల్లి, సోదరుడి ఆధార్ నంబరు, ఇతర వివరాలు ఇవ్వాలని అపార్ట్‌మెంట్ కార్యదర్శిని బెదిరించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
తాను రాజేంద్రనగర్ పోలీసులకు ఫోన్ చేస్తే మాచర్ల నుంచి ఇద్దరు పోలీసులు వచ్చినట్టు చెప్పారని పేర్కొన్నారు. ఆ పోలీసులు, గూండాలు కలిసి అపార్ట్‌మెంట్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా తీసుకెళ్లారని అన్నారు. వారి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, కాబట్టి వారికి రక్షణ కల్పించాలని కోరారు. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని యశస్వి ఆ లేఖల్లో పేర్కొన్నారు.