Idhayam Trust: అనాథాశ్రమంలోని బాలుడు కరోనాతో మరణించినట్టు నమ్మించే ప్రయత్నం.. వెలుగులోకి దారుణ విషయం
- మధురైలోని ఇదయం ట్రస్టులో దారుణాలు
- పిల్లలను లక్షలాది రూపాయలకు అమ్మేసుకుంటున్న నిర్వాహకులు
- పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
అనాథాశ్రమంలోని బాలుడు కరోనాతో మరణించినట్టు నమ్మించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో దారుణ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ అనాథాశ్రమం నుంచి మొత్తం 16 మంది అదృశ్యమైన ఘటన బయపటడడంతో కలకలం రేగింది. తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని మేలూరు సమీపంలోని సేక్కిపట్టికి చెందిన ఐశ్వర్య (22) భర్తను కోల్పోయిన తర్వాత తన ముగ్గురు పిల్లలను ‘ఇదయం ట్రస్టు’ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్పించారు. గత నెల 13న ఐశ్వర్య మూడో కుమారుడు మాణిక్కం (3)కు కరోనా సోకిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని నిర్వాహకుల నుంచి తల్లికి సమాచారం అందింది. అయితే, వారి మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన ఆశ్రమ నిర్వాహకులు శివకుమార్, మదర్షాలు పరారయ్యారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
మాణిక్కంను అపహరించిన నిందితులు శివకుమార్, మదర్షా కలిసి మధురై ఇస్మాయిల్ పురానికి చెందిన కన్నన్, భవానీ దంపతులకు రూ. 5 లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు. అలాగే, శ్రీదేవి అనే మరో మహిళ కుమార్తెను కూడా ఇలాగే విక్రయించినట్టు తెలిసింది. ఇలా ఆశ్రమం నుంచి ఇప్పటి వరకు 16 మంది చిన్నారులు అదృశ్యమైనట్టు గుర్తించారు.
పిల్లలను కొనుగోలు చేసిన కన్నన్, భవానీ దంపతులతోపాటు సక్కుబాయి, సాదిక్ దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, ఆశ్రమంలోని ఏడుగురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఉంటున్న 38 మంది పురుషులు, 35 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులను వేర్వేరు ప్రాంతాల్లోని అనాథాశ్రమాలకు తరలించారు. ఇదయం ట్రస్టు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.