India: అందుకే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది: ఇంగ్లాండ్ మాజీ సారథి కుక్
- టీమిండియా గొప్ప జట్టు
- అయితే, స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం బలహీనత
- మూడు రోజుల ముందుగానే జట్టును ప్రకటించింది
- ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు
టీమిండియా గొప్ప జట్టు అని, అయితే, స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం ఆ టీమ్ బలహీనత అని ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఎంపికలో తప్పులు చేసిందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా తమను తాము అతిగా అంచనా వేసుకుందని చెప్పాడు.
జట్టు ఎంపికపై ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని, మూడు రోజుల ముందుగానే జట్టును ప్రకటించిందని గుర్తు చేశాడు. ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని ముందే తెలిసినా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నారని ఆయన విమర్శించాడు. ఈ కారణం వల్లే ఎక్కువగా సీమ్ బౌలింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కూడా లేదని, అందుకే టీమిండియా ఓడిపోయిందని తెలిపాడు. మరోవైపు న్యూజిలాండ్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టే గెలిచిందని చెప్పాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టులు వారికి ప్రాక్టీస్‌లా ఉపయోగపడ్డాయని తెలిపాడు. కాగా, ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశపర్చింది.