Bihar: మా ప్రభుత్వం అవినీతిమయమైపోయింది.. నా వల్ల కావడంలేదు: బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- డబ్బు లేనిదే పని జరగడం లేదు
- నా శాఖ అధికారులే నా మాట వినట్లేదు
- అధికారులు అంత పోటుగాళ్లా?
- అయితే నేనుండి ఎందుకు?
- రాజీనామా చేస్తానన్న మదన్ సాహ్ని
‘‘ప్రభుత్వం అవినీతిమయమైంది. లంచాలు లేనిదే పని జరగడం లేదు...’’ వంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయి. కానీ, అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగమైన ఓ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..! బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మంత్రే స్వయంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆయన పార్టీ జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) నేత, నితీశ్ కు అత్యంత సన్నిహితుడే చేశారు.
అవినీతిని తట్టుకోలేక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్ని తన పదవికే రాజీనామా చేస్తా అనేంత వరకు వెళ్లింది వ్యవహారం. ‘‘నేను ఇక ఈ పదవిలో ఉండను. రాజీనామా చేసేస్తాను. నేను నిర్వహించే శాఖ ముఖ్య కార్యదర్శే నా మాట వినడం లేదు. ఇక నేనుండి ఎందుకు? ప్రభుత్వం మొత్తం అవినీతి మయమైపోయింది. డబ్బు ముట్టనిదే అధికారులు పనిచేయడం లేదు’’ అని ఆయన అన్నారు. శనివారం రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానన్నారు. తాను ఆమోదించిన బదిలీలనూ అధికారులు హోల్డ్ లో పెట్టడమేంటని ప్రశ్నించారు.
అధికారులే అంత పోటుగాళ్లయితే ఇక ఆ పదవిలో తానుండి లాభమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో కొన్ని సౌకర్యాల కోసం తాను ఈ పదవిచేపట్టలేదన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం నితీశ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తే.. సీఎం తననో బ్లాక్ మెయిలర్ లా చూస్తారని అన్నారు. కాగా, సాహ్నికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మద్దతు ప్రకటించారు.