Nara Lokesh: వర్సిటీలో ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం: లోకేశ్
- రాజకీయాలకు అతీతంగా వర్సిటీలు ఉండాలి
- జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి
- 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి
- ఆయన పుట్టినరోజును వర్సిటీలోనూ నిర్వహించారు
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయని వచ్చిన ఓ వార్తను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేశారు. వీసీ ప్రసాదరెడ్డి తన ఛాంబరులో కేక్ కట్ చేశారని, ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, ఐకాస ఛైర్మన్ ఆచార్య రవి తదితరులు పాల్గొన్నారని అందులో పేర్కొన్నారు. వర్సిటీల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఏంటని లోకేశ్ మండిపడ్డారు.
'రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఏ1 వైఎస్ జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం. స్వయంగా వీసీనే కుల పిచ్చితో దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు చెప్పడం తీరని అన్యాయం చెయ్యడమే' అని లోకేశ్ మండిపడ్డారు.