Afghanistan: రెండు దశాబ్దాల ఆధిపత్యానికి చరమగీతం.. ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వైదొలిగిన అమెరికా బలగాలు!
- వెల్లడించిన అమెరికా అధికారి
- అతిపెద్ద ఎయిర్ బేస్ నుంచి తిరుగు ప్రయాణం
- బగ్రాం వైమానిక స్థావరం ఖాళీ
రెండు దశాబ్దాల ఆధిపత్యానికి తెరపడింది. అమెరికా సహా ఇతర నాటో బలగాలన్నీ ఆఫ్ఘనిస్థాన్ లోనే అతిపెద్ద వైమానిక స్థావరం నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తి స్థాయిలో విదేశీ బలగాల ఉపసంహరణ పూర్తయినట్టేనని అమెరికా రక్షణ శాఖ అధికారి చెప్పారు. తాలిబన్, దానికి మద్దతుగా ఉన్న అల్ ఖాయిదా ఉగ్రవాద సంస్థలపై అమెరికా వైమానిక దాడులు చేయడంలో కీలకంగా ఉన్న బగ్రాం వైమానిక స్థావరం నుంచి బలగాలు వెనుదిరిగాయని ఆయన చెప్పారు.
అయితే, ఆ ఎయిర్ బేస్ ను ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు ఎప్పుడు అప్పగిస్తారన్న విషయాన్ని మాత్రం ఆ అధికారి వెల్లడించలేదు. దాని మీద ఇంకా ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ జరగాలన్న డెడ్ లైన్ నేపథ్యంలో అమెరికా చకచకా పనులను చక్కబెట్టేస్తోంది.
సోవియట్ యూనియన్ తో ప్రచ్ఛన్న యుద్ధం సందర్భంగా 1950లో అమెరికా ఈ బగ్రాం ఎయిర్ బేస్ ను నిర్మించింది. అయితే, ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై రాకెట్ దాడులు చేయడంతో.. భవిష్యత్ లో మరిన్ని దాడులు జరిగే ప్రమాదముందని బలగాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. అయితే, తమను తాము కాపాడుకునేలా ఆఫ్ఘన్ బలగాలకు నాటో బలగాలు శిక్షణనిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక, అమెరికా నిర్మించిన ఈ ఎయిర్ బేస్ ఆ తర్వాతి కాలంలో ఓ చిన్నపాటి పట్టణంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. అక్కడికి వందలాది మంది అమెరికన్లు, ఇతర దేశాల వారు వచ్చి వెళ్లేవారు. దీంతో స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు, స్పాలు, ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్లు, బర్గర్ కింగ్, పిజ్జా హట్ వంటి పెద్ద పెద్ద దుకాణాలూ వెలిశాయి.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడ 9,500 మంది విదేశీ సైనికులుండగా.. అందులో అత్యధికంగా అమెరికా వారే 2,500 మంది ఉన్నారు. అమెరికా, నాటో బలగాలు వెనుదిరుగుతుండడంతో ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలను తాలిబన్ ఉగ్రమూకలు స్వాధీనం చేసుకున్నాయి. రెండు నెలలుగా అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘన్ సైనిక బలగాలు మొత్తం ప్రధాన నగరాల్లోనే మోహరించి ఉండడంతో మిగతా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరిపోయాయి.