Oscar Academy: ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎంపికైన విద్యాబాలన్, ఏక్తా కపూర్
- 2021కి గాను కమిటీని ప్రకటించిన ఆస్కార్ అకాడెమీ
- కమిటీలో 50 దేశాల నుంచి 395 మంది సభ్యులు
- జాబితాలో 46 శాతం మంది మహిళలే కావడం గమనార్హం
ప్రపంచ సినీ రంగంలో అకాడెమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది సినిమా అయినా, యాక్టర్లు అయినా, టెక్నీషియన్లు అయినా... అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. ఎన్నో రకాలుగా వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల వివరాలను ఆస్కార్ అకాడెమీ వెల్లడించింది. ఈ టీమ్ లో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్ ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యుల జాబితాను ఆస్కార్ విడుదల చేసింది.
'ద క్లాస్ ఆఫ్ 2021' పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. జాబితాలో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. ఏక్తా కపూర్ తల్లి, బాలాజీ టెలీ ఫిలింస్ సహ నిర్మాత అయిన శోభా కపూర్ కూడా ఆస్కార్ కమిటీలో ఉన్నారు. 2011లో విడుదలైన 'డర్టీ పిక్చర్' చిత్రానికి గాను విద్యాబాలన్ జాతీయ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే.