Tushar Mehta: సువేందును కలిశారన్న ఆరోపణలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ
- సువేందును సొలిసిటర్ జనరల్ కలిశారంటున్న టీఎంసీ
- ప్రధాని మోదీకి లేఖ
- తన ఆఫీసుకు సువేందు వచ్చారని మెహతా వెల్లడి
- కానీ తాను కలవలేదని స్పష్టీకరణ
బీజేపీ ఎమ్మెల్యే, తన బద్ధ విరోధి సువేందు అధికారిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలిశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై ఇప్పటికే టీఎంసీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. తనపై బెంగాల్ అధికార పక్షం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండడం పట్ల సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. సువేందుతో తాను భేటీ అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
ముందస్తు సమాచారం లేకుండా సువేందు అధికారే తన కార్యాలయానికి వచ్చారని, కానీ ఆయనను తాను కలవలేదని స్పష్టం చేశారు. సువేందు వచ్చిన సమయంలో తాను ఓ కీలక సమావేశంలో ఉన్నానని తుషార్ మెహతా వెల్లడించారు. సువేందు వచ్చిన విషయం సిబ్బంది తనకు నివేదించారని, అయితే ఆయనను తాను కలవలేనన్న విషయాన్ని తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించానని వివరించారు. ఈ విషయం తెలియడంతో సువేందు వెళ్లిపోయారని, అంతకుమించి అక్కడేమీ జరగలేదని పేర్కొన్నారు.
అటు, తమ మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని సువేందు అధికారి కూడా ధ్రువీకరించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస గురించి చర్చించేందుకు సొలిసిటర్ జనరల్ నివాసానికి వెళ్లానని, కానీ ఆయనతో భేటీ కావడం సాధ్యం కాలేదని వెల్లడించారు.