Telangana: అటవీ భూములు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులు.. దాడిచేసి పెట్రోలు పోసిన రైతులు
- నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఘటన
- అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులపై దాడి
- ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జోక్యంతో వెనక్కి తగ్గిన గిరిజనులు
అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడిచేసిన గిరిజన రైతులు వారిపై పెట్రోలు పోసి భయపెట్టిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో నిన్న జరిగింది. గ్రామ పరిధిలోని అటవీ భూములను గత కొన్నేళ్లుగా ఇక్కడి చెంచులు సాగుచేసుకుంటున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారు.
ఈ క్రమంలో నిన్న చెంచులు సాగుచేస్తున్న ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు మాచారం వెళ్లారు. గమనించిన చెంచులు అధికారులను అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. కొందరు రైతులు అటవీ అధికారులపై పెట్రోలు పోయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గారు.