Danam Nagender: కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పుడు ఆ పార్టీలో ఏమీ లేదు: రేవంత్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్

Danam Nagender fires on Revanth Reddy
  • రేవంత్ మాటలకు మూతి, తోక ఏదీ ఉండదు
  • తెలంగాణలో అభివృద్ధి రేవంత్ కు కనిపించడం లేదా?
  • వైయస్ కంటే కేసీఆరే ఎక్కువ అభివృద్ది చేశారు
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడిన వారందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని సూచించారు. కేసీఆర్ నుంచి అధికారాన్ని గుంజుకునుడే అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు.

రేవంత్ మాటలకు మూతి, తోక ఏదీ ఉండదని దానం అన్నారు. గుంజుకొనడానికి ఇది ఎవడబ్బ సొమ్ము కాదని దుయ్యబట్టారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరానని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తనను ఇబ్బంది పెట్టడం వల్లే... ఆ పార్టీ నుంచి తాను బయటకు వచ్చానని అన్నారు. అయినా కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పుడు ఆ పార్టీలో ఏమీ లేదని చెప్పారు.

రేవంత్ కు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? అని దానం ప్రశ్నించారు. వైయస్సార్ కంటే కేసీఆరే ఎక్కువ అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు చీము, నెత్తురు ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని చెప్పారు. రేవంత్ కింద ఎలా పని చేస్తారని అడిగారు. వీహెచ్ ఆసుపత్రిలో ఉన్నారని... లేకపోతే ఇప్పటికే దుమ్ము లేచిపోయేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా ఉండి తాము ఫెయిల్ అయ్యామని... ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామని చెప్పారు.
Danam Nagender
TRS
Revanth Reddy
Congress

More Telugu News