Simhachalam: తొమ్మిది మంది సింహాచలం ఆలయ వైదికులకు షోకాజ్ నోటీసులు
- గత జ్యేష్ట ఏకాదశి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం
- గరుడ గజ్జన పాటను ఆలపించిన అర్చకులు
- మార్ఫింగ్ చేసిన వైదికులు
సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి చెందిన తొమ్మిది మంది వైదికులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గడచిన జ్యేష్ట ఏకాదశి రోజున జరిగిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తొమ్మిది మంది వైదికులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు తాను మార్ఫింగ్ చేసి ఇన్చార్జి ప్రధాన అర్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఒక వేద పండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైదికులందరినీ అధికారులు విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ మాట్లాడుతూ, ఇకపై ఆలయ దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని చెప్పారు. ఉద్యోగులు కూడా దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని అన్నారు.