SBI: ఎస్బీఐ డిజిటల్ లావాదేవీలకు రేపు స్వల్ప అంతరాయం!
- సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేస్తున్న ఎస్బీఐ
- జులై 4 వేకువజాము నుంచి ఉదయం వరకు అంతరాయం
- కొద్దిసేపు సేవలు నిలిచిపోతాయన్న ఎస్బీఐ
- ఓ ప్రకటనలో వెల్లడి
అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆన్ లైన్, డిజిటల్ సేవలను మరింత ఆధునికీకరిస్తోంది. సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేసే క్రమంలో ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం కలగనుందని ఎస్బీఐ వెల్లడించింది. జులై 4 ఆదివారం వేకువజామున 3.25 గంటల నుంచి ఉదయం 5.50 గంటల వరకు డిజిటల్, ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది.
ఎస్బీఐ యోనో, యూపీఐ ఆధారిత సేవలు, ఎస్బీఐ ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలు కొద్దిసేపు నిలిచిపోతాయని ఓ ప్రకటనలో వివరించింది. మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ మార్పులు చేపడుతున్నామని, ఖాతాదారులు దీన్ని గమనించాలని సూచించింది.