Bonalu: ఏపీలో తెలంగాణ బోనాలు... హాజరుకానున్న సీఎం జగన్
- 2010 నుంచి ఏపీలోనూ బోనాలు
- బెజవాడ కనకదుర్గమ్మకు బోనాల సమర్పణ
- తాజాగా ఏపీ మంత్రి వెల్లంపల్లిని కలిసిన బోనాల కమిటీ
- ఉత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది ఆషాఢంలో నిర్వహించే ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తివిశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే, తెలంగాణ బోనాలను ఏపీలోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడలోనూ బోనాలు జరగనున్నాయి. బోనాల కమిటీ ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించింది. విజయవాడలో నిర్వహించబోయే బోనాల ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు కమిటీ వెల్లడించింది.
2010 నుంచి భాగ్యనగర్ బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోనూ బోనాల వేడుకలు చేపడుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జులై 18న విజయవాడలో బోనాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. ఇక్కడి దుర్గమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించనున్నారు.
ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బత్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కోరింది.