Sania Mirza: వింబుల్డన్ లో సానియా జోడీకి చుక్కెదురు
- డబుల్స్ రెండో రౌండ్లో ఓటమి
- బెతానీ జంటగా బరిలో దిగిన సానియా
- సానియా-బెతానీ జోడీపై రష్యా భామల విజయం
- వరుస సెట్లలో గెలిచిన వెస్నినా-కుదెర్మెటోవా జోడీ
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జాకు ఓటమి ఎదురైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం చవిచూసింది. ఇవాళ జరిగిన డబుల్స్ మ్యాచ్ లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది.
తొలి సెట్ లో కాస్తో కూస్తో పోరాడిన సానియా జోడీ... రెండో సెట్ లో చేతులెత్తేసింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది. ఇక ఆమె మిక్స్ డ్ డబుల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండో రౌండ్ మ్యాచ్ లో సానియా-రోహన్ బోపన్న జోడీ... బ్రిటీష్ జంట ఐడన్ మెక్ హ్యూ, ఎమిలీ వెబ్లీ స్మిత్ తో తలపడనుంది.