Japan: జపాన్‌లో బురద బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, 20 మంది గల్లంతు
- భారీ వర్షాలతో కొట్టుకొచ్చిన వరద
- ఇద్దరి మృతి
- పూడుకుపోయిన ఇళ్లు
- కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
జపాన్‌లోని అటామి నగరంలో బురద వెల్లువలా విరుచుపడడంతో 19 మంది గల్లంతయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఈ బురద దాటికి 80 ఇళ్లు పూర్తిగా పూడుకుపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. రాజధాని టోక్యోకు పశ్చిమంగా వంద కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీర పట్టణమైన అటామిలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనికి తోడు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోయలు, పర్వత ప్రాంతాల్లోని మట్టి వదులుగా మారి సమీప పట్టణాలు, గ్రామాలను ముంచెత్తుతోంది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కాగా, గల్లంతైన వారి సంఖ్య వందకుపైనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వెల్లువలా దూసుకొచ్చిన బురదను చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.