WHO: ఏ దేశమూ కరోనా వైరస్ ముప్పు నుంచి బయట పడలేదు: డబ్ల్యూహెచ్‌వో
- డెల్టా వంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి
- ప్రమాదకరమైన దశలోనే ప్రపంచం
- వ్యాక్సినేషన్ కొనసాగని దేశాల్లో కరోనా వ్యాప్తి
- డెల్టా వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించాం
కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం ఇప్పటికీ ప్రమాదకరమైన దశలోనే ఉందని ఆయన తెలిపారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం తక్కువగా కొనసాగుతోన్న దేశాల్లో కరోనా రోగుల సంఖ్య మళ్లీ పెరిగిపోతోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ దేశమూ కరోనా వైరస్ ముప్పు నుంచి బయట పడలేదని తెలిపారు. వేగంగా విజృంభిస్తోన్న డెల్టా వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని చెప్పారు. కరోనా బాధితులను గుర్తించి, వారిని ఐసోలేషన్ లో ఉంచడం వంటి పద్ధతులు పాటించాలని కోరారు.
కరోనా జాగ్రత్తలను క్రమం తప్పకుండా పాటించాలని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోని ప్రతి దేశంలో 70 శాతం మందికి వ్యాక్సిన్లు అందాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు సరిగ్గా అందని దేశాల్లో కరోనా మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. టీకాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన చెప్పారు.