Blood Clots: సూది గుచ్చే తీరులో తేడాల వల్లే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం: నూతన అధ్యయనం వెల్లడి
- ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
- బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతున్నట్టు ఫిర్యాదులు
- తాజాగా మ్యూనిచ్ వర్సిటీ అధ్యయనం
- సూదిని కండరంలోకి ఎక్కించాలని వెల్లడి
- రక్తనాళాల్లోకి ఎక్కిస్తే బ్లడ్ క్లాట్స్ వస్తాయని వివరణ
ఇటీవల కొన్ని ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా టీకాలు తీసుకుంటే రక్తంలో గడ్డలు (బ్లడ్ క్లాట్స్) కడుతోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో అనేక దేశాలు ఆ వ్యాక్సిన్ల డోసులను తిప్పి పంపాయి. అయితే, రక్తంలో గడ్డలు కట్టడం అనేది వ్యాక్సిన్ వల్ల కాదని, వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు సూది గుచ్చే తీరులో తేడాల వల్లేనని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది.
వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఇంజెక్షన్ ను కండరంలోకి ఎక్కించాల్సి ఉంటుందని, అయితే పొరపాటున అది రక్తనాళాల్లోకి ఎక్కించినప్పుడు రక్తం గడ్డలు కడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు జర్మనీలోని మ్యూనిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యాక ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్, మరికొన్ని వ్యాక్సిన్ల విషయంలో ఈ బ్లడ్ క్లాట్స్ ఫిర్యాదులు వినిపించాయి. వీటినే వైద్య పరిభాషలో పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్-టీటీఎస్ లేక, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా-వీఐటీటీ అంటారు. అయితే ఇది వ్యాక్సిన్ మందు వల్ల కాదని, వ్యాక్సిన్ ఎక్కించడంలో తేడా వల్ల ఉత్పన్నమయ్యే సమస్య అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.