HCA: హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్ క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై అనర్హత వేటు
- హెచ్‌సీఏ సంక్షోభంలో మరో మలుపు
- అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై వేటు
- ఆదేశాల అమలు బాధ్యత అజారుద్దీన్‌కు
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఇటీవల నెలకొన్న సంక్షోభం కీలక మలుపు తిరిగింది. హెచ్‌సీఏ చీఫ్ అజారుద్దీన్‌పై వేటు వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై సంఘం అంబుడ్స్‌మన్ దీపక్ శర్మ వేటు వేశారు. దీంతో అజారుద్దీన్‌కు మళ్లీ అధికారాలు చేకూరాయి. తాజా ఆదేశాలను అమలు చేయడంతోపాటు హెచ్‌సీఏ పాలన సజావుగా సాగేలా అజారుద్దీన్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని దీపక్ శర్మ తెలిపారు. కాగా, వేటు పడినవారిలో వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధ ఉన్నారు. హెచ్‌సీఏలో అక్రమాలకు సంబంధించి వీరందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.