Amaravati: రాజధాని విషయంలో మద్దతు కోరుతూ ఎంపీలందరికీ అమరావతి జేఏసీ లేఖ

Amaravati JAC wrote letter to MPs to support Amaravati

  • ఏడు పేజీల లేఖ రాసిన జేఏసీ నేతలు
  • విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒకే రాజధాని ఉండాలన్న నేతలు
  • కేంద్ర హోంశాఖ ప్రమాణపత్రం రాజ్యాంగ విరుద్ధమన్న జేఏసీ

ఆరు నూరైనా ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్న ఏపీ మంత్రుల ప్రకటన నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాశారు. ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు మద్దతు తెలపాలని కోరుతూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి, కన్వీనర్ కె.శివారెడ్డి ఏడు పేజీల లేఖ రాశారు.

రాజధానిగా అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. 2014లో పార్లమెంటు ఆమోదించిన పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లును శాసనమండలి తిరస్కరించడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ బిల్లును ఆమోదించిందని పేర్కొన్నారు.

రాజధాని ఎంపికలో తమ పాత్రేమీ లేదన్న కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో గతేడాది ప్రమాణపత్రం దాఖలు చేసిందని గుర్తు చేశారు. నిజానికి రాష్ట్ర రాజధాని మార్పు, పేరు మార్పు అధికారం పార్లమెంటుకు ఉంటుందని, కాబట్టి కేంద్ర హోంశాఖ సమర్పించిన ప్రమాణపత్రం రాజ్యాంగ విరుద్ధమని  జేఏసీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News