Moderna: జులై 15 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో మోడెర్నా కరోనా వ్యాక్సిన్లు
- ఇటీవల మోడెర్నాకు డీసీజీఐ అనుమతి
- మోడెర్నా, సిప్లా మధ్య ఒప్పందం
- భారత్ లో మోడెర్నా టీకాలు పంపిణీ చేయనున్న సిప్లా
- డోసులు దిగుమతి చేసుకుంటున్న సిప్లా
భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇటీవల మోడెర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర అనుమతులు మంజూరైన నేపథ్యంలో, జులై 15 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి. భారత్ లో మోడెర్నా వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వ్యాక్సిన్ డోసులను సిప్లా దిగుమతి చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి వీటిని దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించనున్నారు.
కాగా, మోడెర్నా వ్యాక్సిన్ డోసులు పొందిన తొలి వంద మంది ఆరోగ్యాన్ని వారం రోజుల పాటు పరిశీలించి, ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిప్లా సమర్పించాల్సి ఉంటుంది. ఈ షరతుపైనే మోడెర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చారు. ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ సమర్థత 90 శాతానికి పైనే ఉండడం విశేషం. అమెరికా, యూరప్ దేశాల్లో మోడెర్నా టీకాల పంపిణీ ఎప్పటినుంచో జరుగుతోంది.