CBI Court: డిశ్చార్జ్ పిటిషన్‌పై మరోమారు వాయిదా కోరిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రూ. 3 వేల జరిమానా విధించిన సీబీఐ కోర్టు
- ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు
- ఇకపై వాయిదాలు ఉండబోవని స్పష్టం చేసిన కోర్టు
- తదుపరి విచారణలో వాదనలు వినిపించాల్సిందేనని హెచ్చరిక
ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు రూ.3 వేల జరిమానా విధించింది. ఈ కేసులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై ఆమె వాయిదా కోరడంతో కోర్టు ఈ జరిమానా విధించింది. వాదనలు వినిపించేందుకు పలు అవకాశాలు కల్పించినా ఉపయోగించుకోలేదని, ఇకపై వాయిదాలు ఉండవని తేల్చి చెప్పింది.
ఓఎంసీ కేసులో సరిహద్దు వివాదం తేలే వరకు అక్రమ మైనింగ్ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు శ్రీలక్ష్మి తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణలో కనుక వాదనలు వినిపించకుంటే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఈ నెల 12కు విచారణను వాయిదా వేశారు.