Pfizer: కరోనాను అడ్డుకోకున్నా.. తీవ్రతను తగ్గిస్తున్న ఫైజర్​ టీకా: ఇజ్రాయెల్​ ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి

Pfizer Shot Halts Severe Infections

  • టీకా ప్రభావం 64 శాతానికి తగ్గుదల
  • అంతకుముందు 94 శాతం
  • ఆసుపత్రి ముప్పును తగ్గించడంలో 93% ప్రభావశీలత

‘కరోనా కేసుల తీవ్రత’ను ఫైజర్ సంస్థ తయారు చేసిన టీకా (కొమిర్నాటీ) చాలా వరకు తగ్గిస్తోందని తేలింది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా  ప్రజలను కరోనా బారిన పడకుండా మాత్రం ఆ టీకా అడ్డుకోలేకపోతోందని వెల్లడైంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి. ఆ డేటాను ఆ దేశం విడుదల చేసింది.

 అంతకుముందు కరోనా సోకకుండా వ్యాక్సిన్ తో రక్షణ 94 శాతంగా ఉండేదని, కానీ, జూన్ 6 నుంచి ఈ నెల ఇప్పటివరకు అది 64 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది. దీనికి ‘డెల్టా కరోనా’నే కారణమని ఆ దేశ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, కరోనా బారిన పడేవారు పెరుగుతున్నా.. కరోనా తీవ్రతను మాత్రం 93 శాతం తగ్గిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. డెల్టా సోకిన వారు ఆసుపత్రులకు వెళ్లే ముప్పు తక్కువగానే ఉందని చెప్పింది. అయితే, అంతకుముందు ఆసుపత్రులకు వెళ్లే ముప్పును వ్యాక్సిన్ 97% తగ్గించడం గమనార్హం.

అయితే, ఇజ్రాయెల్ అధ్యయనంపై మాట్లాడేందుకు ఫైజర్ అధికార ప్రతినిధి డెర్విలా కియాన్ నిరాకరించారు. కొత్త ఉత్పరివర్తనాలపైనా వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయన్న ఆమె.. ఆ అధ్యయనాల వివరాలను చూపించారు. వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని ఆమె తేల్చి చెప్పారు.

కాగా, 93 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ లో ఇప్పటికే 64 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇటీవలే మాస్కులు, భౌతిక దూరం వంటి ఆంక్షలను ఎత్తేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండడంతో మాస్క్ రూల్ ను మళ్లీ తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News