Puri: జగన్నాథుడి రథయాత్ర పూరీకే పరిమితం: ఒడిశా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

Hope God will Allow Next Time Supreme Court Says Rath Yatra In Puri Only

  • ఒడిశా ప్రభుత్వ నిర్ణయంపై జోక్యం చేసుకోం
  • సరైన నిర్ణయమే తీసుకుందన్న సీజేఐ ఎన్వీ రమణ
  • ఇంట్లోనే పూజ చేసుకోవచ్చని కామెంట్
  • పూరీలోనే రథయాత్రకు ఒడిశా అనుమతి
  • బార్ఘర్, కేంద్రపాదలోనూ నిర్వహించాలని పిటిషన్

పూరీ జగన్నాథుడి రథయాత్రపై ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆంక్షల నడుమ కేవలం పూరీలోనే జులై 12న రథయాత్ర నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

అయితే, పూరీతో పాటు కేంద్రపాద, బార్ఘర్ జిల్లాల్లోనూ రథయాత్ర చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఒడిశా హైకోర్టులో కొందరు భక్తులు పిటిషన్లు వేశారు. వాటిని హైకోర్టు కొట్టేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒడిశా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఆ పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. వాటన్నింటినీ కొట్టేసింది. ‘‘వచ్చేసారైనా ఆ దేవుడే రథయాత్ర చేయిస్తాడని ఆశిద్దాం. అంతా ఆ దేవుడి దయ’’ అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘నేను కూడా ఎప్పుడూ పూరీకి వెళ్తుంటాను. కానీ, ఏడాదిన్నరగా వెళ్లట్లేదు. ఇంట్లోనే పూజలు చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో నుంచి కూడా దేవుడిని పూజించొచ్చు. రథయాత్ర విషయంలో ఒడిశా ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది’’ అని అన్నారు.

వాస్తవానికి గత ఏడాది కూడా కేవలం పూరీలోనే రథయాత్ర చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, కేవలం 500 మందితోనే రథయాత్రను నిర్వహించాలని, రథయాత్ర సమయంలో కర్ఫ్యూ విధించాలని సూచించింది. కానీ, ఆ ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. రథయాత్ర కోసం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

  • Loading...

More Telugu News