Telangana: ధర్మాసనానికి ఉద్దేశాలు ఆపాదిస్తారా?: తెలంగాణ ఏజీపై హైకోర్టు సీజే అసహనం
- ఏ బెంచ్ విచారించాలో నేనే తేలుస్తా
- మీరు కావాలంటే పిటిషన్ వెనక్కు తీసుకోవచ్చు
- విద్యుదుత్పత్తిపై ఏపీ రైతుల పిటిషన్
- జస్టిస్ ఏపీ వ్యక్తి అన్న తెలంగాణ ఏజీ
- సీజే బెంచ్ కు అప్పగించాలంటూ మధ్యంతర పిటిషన్
జల వివాద పిటిషన్ల విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాసనానికి ఉద్దేశాలు ఆపాదించడం మంచిదికాదని అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్ ను ఫలానా ధర్మాసనమే విచారించాలని కోరుకోవడం సరి కాదన్నారు. ఏ బెంచ్ విచారించాలో తానే నిర్ణయిస్తానని, కావాలంటే పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని అన్నారు. దీంతో మధ్యంతర పిటిషన్ ను వెనక్కు తీసుకుంటానని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇటు ఏపీ పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణపైనా సీజే హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా బేసిన్ లో విద్యుదుత్పత్తి చేయాలంటూ గత నెల 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఏపీలోని కృష్ణా జిల్లా రైతులు తెలంగాణ హైకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. అయితే, ఆ పిటిషన్ ను జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు చేపట్టింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏజీ ప్రసాద్.. సీజే నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేయాలంటూ ఇవ్వాళ మధ్యంతర పిటిషన్ ను దాఖలు చేశారు.
నదీ జలాల అంశాలకు సంబంధించి రోస్టర్ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీజే దృష్టికి తీసుకెళ్లామని, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా సీజే చెప్పారని అన్నారు. జస్టిస్ రామచంద్రరావు ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి.. వేరే ధర్మాసనానికి విచారణను బదిలీ చేయాలని కోరారు.
దీనిపై జస్టిస్ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టాక అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. ఏజీ తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సీజే నుంచి స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో సీజే కూడా ఇరు వర్గాల న్యాయవాదులపై ఫైర్ అయ్యారు. ఇరు వైపుల న్యాయవాదులు కేసులో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.