Raghu Rama Krishna Raju: ఈ ప్రభుత్వంలో సజ్జల పాత్ర ఏంటో వివరించాలని కోరుతున్నాం: సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

Raghurama Krishna Raju shot his eighth letter to CM Jagan

  • సజ్జల పరిధి దాటి ప్రవర్తిస్తున్నారన్న రఘురామ
  • ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని వ్యాఖ్య 
  • పార్టీ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారు 
  • ప్రజాతీర్పు అపహాస్యానికి గురవుతోంది 
  • సీఎం జగన్ వివరణ ఇవ్వాలన్న రఘురామ 

ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొన్నిరోజులుగా 'నవ సూచనలు' పేరుతో సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రఘురామ ఎనిమిదో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటో స్పష్టంగా వివరించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వానికి ప్రజా సంబంధాల విషయంలో సలహాదారు అని అందరికీ తెలిసిందేనని, కానీ, ఆయన ప్రతి అంశంపైనా స్పందిస్తున్నాడని, ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లేకపోతే లోగుట్టు పెరుమాళ్లకెరుక అని భావించాలా? అని పేర్కొన్నారు.

"సజ్జల రాజ్యాంగేతర శక్తిగా పరిణమిస్తున్నాడని ప్రజానీకం భావిస్తోంది. అధికారులకు సూచనలు ఇస్తూ ప్రభావితం చేయడం, మంత్రులను బెదిరించడం, ప్రభుత్వం పేరిట పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. తన అధికారాన్ని, హోదాను విపరీతస్థాయిలో ప్రదర్శిస్తూ తెరవెనుక హోంమంత్రిగా చెలామణీ అవుతున్నారని పార్టీ వర్గాల్లోనూ మాట వినిపిస్తోంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం తాను ఉన్న పదవికి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటే మాత్రం... ఓ ప్రభుత్వ సేవకుడిగా పార్టీ కార్యకలాపాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేరు. తాను ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదని, నాలుగు జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి-ఇన్చార్జినని చెప్పుకున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటూ, మరోవైపు పార్టీ కార్యకలాపాలు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు ఆయన ప్రభుత్వం తరఫున మాట్లాడాలి అనుకుంటే మండలికి పంపడమో, మంత్రివర్గంలోకి తీసుకోవడమో చేయండి. అలా కాకుండా సజ్జలను ఇలాగే కొనసాగిస్తే మాత్రం ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నట్టే లెక్క.

డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ వంటి ఉన్నత విద్యావంతులైన వృత్తి నిపుణులు మీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ, సజ్జల వారిని కూడా మించిపోయి క్యాబినెట్ మంత్రి తరఫున నీటి పారుదల అంశాలపై మాట్లాడుతున్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మనసులోనూ ఈ అసంతృప్తి ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వంలో సజ్జల పాత్ర ఏంటో వివరించాలని కోరుతున్నాం" అంటూ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News