Sputnik V: థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో.. ఇకపై ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో స్పుత్నిక్ వి టీకాలు కూడా!
- ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ పంపిణీ
- మూడో వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచుతున్నట్టు కేంద్రం వెల్లడి
- ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్పుత్నిక్ వి పంపిణీ
- పోలియో వ్యాక్సిన్ల తరలింపు సౌకర్యాల వినియోగం
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ తప్పదన్న అంచనాలు, డెల్టా ప్లస్ వేరియంట్ తో ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్.కె. అరోరా వెల్లడించారు. ప్రస్తుతం స్పుత్నిక్ వి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉందని, ఇకపై కేంద్ర ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ రష్యా వ్యాక్సిన్ ను కూడా భాగం చేస్తున్నామని వివరించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల సరఫరా ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయింపులు ఉంటాయని తెలిపారు.
ఈ వ్యాక్సిన్ ను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాల్సి ఉంటుందని, పోలియో వ్యాక్సిన్ల తరలింపు సౌకర్యాలను ఉపయోగించుకుని స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను కూడా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా చేస్తామని డాక్టర్ అరోరా చెప్పారు.