Stan Swamy: స్టాన్ స్వామి మృతి నేపథ్యంలో రాష్ట్రపతికి లేఖ రాసిన విపక్ష నేతలు
- నిన్న ముంబయిలో స్టాన్ స్వామి మృతి
- గుండెపోటుతో కన్నుమూత
- బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి
- తప్పుడు కేసులు పెట్టారన్న విపక్ష నేతలు
కస్టడీలో ఉన్న ప్రముఖ హక్కుల నేత ఫాదర్ స్టాన్ స్వామి మృతి చెందడం పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టాన్ స్వామిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఎలుగెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. కస్టడీలో ఉన్న ఆయన పట్ల అమానవీయ ధోరణిలో వ్యవహరించారని ఆరోపించారు.
ఈ లేఖపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా సంతకాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో రాష్ట్రపతి తేల్చాలని స్పష్టం చేశారు.