Dilip Kumar: బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

Film Legend Dilip Kumar Dies At 98

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సమస్యలు
  • 1922లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జననం
  • సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మిన దిలీప్ కుమార్

బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కుమార్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్వాస సమస్యతో గత బుధవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్ 6న తొలుత ఆయనను ఆసుపత్రిలో చేర్చగా ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుట పడడంతో అదే నెల 11న డిశ్చార్జ్ చేశారు. దిలీప్ కుమార్ మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

కిడ్నీ, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ గత కొన్నేళ్లుగా ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన తన 94వ బర్త్ డేను ఆసుపత్రిలోనే చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబరుతో ఆయన 99వ పడిలోకి ప్రవేశించనున్నారు. గతేడాది మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ముందుజాగ్రత్త చర్యగా తాను, తన భార్య, నటి సైరాబాను పూర్తి ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్నట్టు దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. భారతీయ సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయే నయా దౌర్, మొఘల్-ఏ-అజామ్, దేవ్‌దాస్, రామ్ ఔర్ శ్యామ్, అందాజ్, మధుమతి, గంగా జమున వంటి సినిమాల్లో నటించారు. 1940లలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. 1980ల నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి క్రాంతి, శక్తి, కర్మ, సౌదాగర్ వంటి సినిమాల్లో నటించారు. 1998లో వచ్చిన 'ఖిలా' దిలీప్ కుమార్ చివరి సినిమా.

1 డిసెంబరు 1922లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా ఎదిగారు. 1944లో తొలిసారి 'జ్వర్ ఖాతా' అనే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.

  • Loading...

More Telugu News