Yediyurappa: కావేరి నదిపై ప్రాజెక్టును నిర్మించి తీరుతాం.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు: కర్ణాటక సీఎం యడియూరప్ప
- మేకెదాటు ప్రాజెక్టును కొనసాగిస్తాం
- స్టాలిన్ కు లేఖ రాశాను
- ఆయన నుంచి స్పందన రాలేదు
- చట్టబద్ధంగానే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం
కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై మేకెదాటు ప్రాజెక్టును నిర్మించతలపెట్టింది. దీనిపై కర్ణాటక సీఎం యడియూరప్ప తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
తాము దీనిపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాసినప్పటికీ, దీనికి ఆయన సరైన విధంగా స్పందించలేదని ఆయన చెప్పారు. తాము ఏదేమైనప్పటికీ ప్రాజెక్టును కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. మేకెదాటు పథకంతో కర్ణాటకకే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి కూడా లబ్ధి కలుగుతుందని ఆయన అన్నారు. తాము చట్టబద్ధంగానే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.