YS Sharmila: నేడు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం.. రాయదుర్గంలో జెండా ఆవిష్కరణ
- సాయంత్రం ఐదు గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ
- ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు
- ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొననున్న విజయమ్మ, అనిల్ కుమార్ తదితరులు
తెలంగాణ రాజకీయాల్లోకి మరో రాజకీయ పార్టీ వచ్చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు తన పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు.
వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితోపాటు కోర్ టీం సభ్యులైన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు సభావేదికపై జెండా ఆవిష్కరణలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.