COVID19: జలకాలాటలలో మునిగారు.. కరోనాను మరిచారు: వీడియో వైరల్​

Hundreds throng Kempty Falls in Mussoorie with No Mask No Physical Distance

  • ముస్సోరి జలపాతానికి కుప్పలు తెప్పలుగా జనం
  • కరోనా నిబంధనల ఊసే లేదు
  • మాస్కులు ధరించలేదు
  • భౌతిక దూరం పాటించలేదు
  • మండిపడుతున్న నెటిజన్లు

సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం ఎంత తీవ్రంగా ఉందో కళ్లారా చూశాం. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారు. తమ వాళ్లను కాపాడుకునేందుకు ఆక్సిజన్ కోసం లైన్ లో నిలబడి తెచ్చుకున్నా  ఫలితం దక్కని దాఖలాలున్నాయి. డెల్టా అని, డెల్టా ప్లస్ అని, లామ్డా అని రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వేవ్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, జనంలో మాత్రం మార్పు రావట్లేదు.

మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, కరోనా నియమాలను అనుసరించడం వంటి వాటిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎక్కడపడితే అక్కడ గుంపులు కట్టేస్తున్నారు. పైగా మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. ఎంజాయ్ మెంట్ లో మురిసిపోతూ కరోనాను మరచిపోతున్నారు. ఇదిగో వీళ్ల తంతు అలాగే ఉంది మరి.

ఉత్తరాఖండ్ లో కరోనా ఆంక్షలను సడలించిన తర్వాత జనం రోడ్లెక్కేశారు. ముస్సోరి, నైనిటాల్ వంటి ప్రాంతాలకు గుంపులు కట్టేస్తున్నారు. హోటళ్లు ఫుల్లయ్యాయి. అక్కడికి వచ్చిపోయే వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే వందలాది మంది ముస్సోరిలోని కెంప్టీ జలపాతం వద్ద సందడి చేస్తూ కనిపించారు. కానీ, ఒక్కరైనా అక్కడ కరోనా నిబంధనలను పాటించలేదు. మాస్కుల్లేవు, దూరం లేదు.. అంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లోనే ఉండిపోయారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కెంప్టీలో ఎంప్టీ బ్రెయిన్స్ (బుర్రలేనోళ్లు)’ అని కామెంట్ చేస్తున్నారు. ‘ఇది చాలా పవర్ ఫుల్ మూవ్: జలకలాడండి.. చావండి’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. అందరికీ కలిపి ఒక్కటే మెదడున్నట్టుందంటూ ఇంకో వ్యక్తి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News