Andhra Pradesh: ప్రైవేటీకరణలో వేగం పెంచిన కేంద్రం.. కదం తొక్కిన ‘ఉక్కు’ కార్మికులు
- పరిశ్రమ గేటు ముందు బైఠాయించి ధర్నా
- కొనేందుకు వస్తే విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని అల్టిమేటం
- వేల కోట్ల పన్నులు కడుతున్నా ప్రైవేటీకరణ చేయడంపై మండిపాటు
విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేయడంపై కార్మికులు కదం తొక్కారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవ్వాళ ఉదయం పరిశ్రమ గేటు బయట బైఠాయించి కార్మికులు ధర్నాకు దిగారు. సంస్థ కొనుగోలు కోసం ఎవరు వచ్చినా విమానాశ్రయం దగ్గరే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.
వేల కోట్ల రూపాయల పన్నులను సంస్థ చెల్లిస్తున్నా ప్రైవేటీకరణ చేయడమేంటని నిలదీశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే సరిపోదని, దాని కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం కోసం లావాదేవీల సలహాదారు, న్యాయ సలహాదారుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రైవేటీకరణలో వారిచ్చే సలహాలు, సూచనలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం ముందుకెళ్లడంపై కార్మికులు మండిపడుతున్నారు.