Hashim Amla: సఫారీ మాజీ క్రికెటర్ ఆమ్లా సూపర్ డిఫెన్స్... అవుట్ చేయలేక కౌంటీ బౌలర్ల ఆపసోపాలు
- హాంప్ షైర్, సర్రే జట్ల మధ్య మ్యాచ్
- సర్రే తరఫున ఆడుతున్న ఆమ్లా
- 278 బంతుల్లో 37 నాటౌట్
- 125వ బంతికి బౌండరీ కొట్టిన ఆమ్లా
- మ్యాచ్ ను డ్రా చేసుకున్న సర్రే
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా బ్యాటింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ గోడలా ప్రత్యర్థి బౌలింగ్ దాడులను కాచుకుంటూ, క్రీజులో పాతుకుపోయే ఆమ్లా తన కెరీర్ లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఇంగ్లండ్ దేశవాళీ కౌంటీ క్రికెట్ లో ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో సర్రే జట్టును ఓటమి నుంచి రక్షించడానికి ఆమ్లా తనకు మాత్రమే సాధ్యమైన సహనాన్ని ప్రదర్శించాడు. ఏకంగా 278 బంతులు ఎదుర్కొని అజేయంగా 37 పరుగులు చేశాడు.
ప్రత్యర్థి జట్టు హాంప్ షైర్ బౌలర్లు ఆమ్లాను అవుట్ చేయలేక చేతులెత్తేశారు. ఆట ఆఖరి రోజుంతా క్రీజులో నిలిచిన ఆమ్లా సర్రే పాలిట ఆపద్బాంధవుడే అయ్యాడు. సిక్సర్లు, ఫోర్లతో భారీ ఇన్నింగ్స్ ప్రదర్శించడమొక్కటే గొప్ప కాదని, వికెట్ అప్పగించకుండా మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలవడం కూడా ఓ ఘనతేనని ఆమ్లా తన ఇన్నింగ్స్ తో చాటాడు.
ఈ మ్యాచ్ లో హాంప్ షైర్ మొదటి ఇన్నింగ్స్ లో 488 పరుగులు చేయగా, సర్రే 72 పరుగులకే ఆలౌటైంది. ఆమ్లా చేసిన 29 పరుగులే అందులో అత్యధికం. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆమ్లా డిఫెన్స్ ను ఛేదించడం హాంప్ షైర్ బౌలర్ల వల్ల కాలేదు. ప్రత్యర్థి కెప్టెన్ రకరకాలు ఎత్తుగడలు వేసినా అపార అనుభవజ్ఞుడు ఆమ్లా ముందు అవేవీ పనిచేయలేదు.
ఆమ్లా ఏమాత్రం ఏకాగ్రత సడలనివ్వకుండా ఆడి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తాను ఆడిన 125వ బంతికి ఓ బౌండరీ సాధించాడు. ఆట చివరికి సర్రే 8 వికెట్లకు 122 పరుగులు చేయగా, ఓవైపు ఆమ్లా అజేయంగా నిలిచాడు. దాంతో హాంప్ షైర్ తో మ్యాచ్ ను సర్రే డ్రా చేసుకుంది.
ఆమ్లా పోరాటం ప్రత్యర్థి జట్టును కూడా ఆకట్టుకుంది. ఆట ముగిసిన తర్వాత హాంప్ షైర్ ఆటగాళ్లు ఆమ్లాను ప్రత్యేకంగా అభినందించారు.